విభేషణుడు శ్రీ రాముడిని శరణు కోరుట
రావణుడి సభలో అనేకమంది రాక్షస ప్రముఖులు, “ఇప్పుడే వెళ్ళి రామ లక్ష్మణులనూ, వానరసేనను నాశనం చేస్తాం,” అంటూ లేవటం చూసి, విభీషణుడు వారిని వారించి, కూర్చోమని, చేతులు -మోడ్చి రావణుడితో ఇలా అన్నాడు.
“సామ దాన భేదోపాయాల వల్ల సాధ్యం కాని దాన్నే దండోపాయం ద్వారా సాధించా లని బుద్ధిమంతు లంటారు. ప్రమత్తులూ, దురాశాపరులు, దైవోపహతులూ అయిన వారి పట్ల శాస్త్రీయంగా ప్రయోగిస్తే దండోపాయం ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. శ్రీ రాముడు అప్రమత్తుడు, బలవంతుడు. హనుమంతుడు సముద్రం దాటి, లంకకు వచ్చి చేసిన అద్భుత కార్యాలు చూస్తే దైవం రాముడికి అనుకూలంగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. శత్రుబలాన్ని తక్కువ చేసి చూడవద్దు. రాముడు రాక్షసులకు చేసిన అపకారానికి ప్రతీకారంగా రావణేశ్వరుడు సీతను ఎత్తుకు వచ్చాడందా మనుకున్నా, రాముడు తానై ఖరుడు మొదలైన రాక్షసులను చంపలేదు. వాళ్ళే పనిపెట్టుకుని అతని పైకి వెళ్ళారు. రాముడు ఆత్మరక్షణ కొరకు వారిని చంపవలిసి వచ్చింది. సీతను తీసుకు రావటం మనకే చేటు. ఆమెను తిరిగి రాముడికివ్వటం. మంచిది. నీ మేలు కోరి ఈ మాట చెబు తున్నాను. రాముడి బాణాలు లంకను సర్వనాశనం చెయ్యక ముందే సీతను రాముడి కిచ్చెయ్యి.”
విభీషణు డీ మాట లనగానే రావణుడు సభ చాలించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. విభీషణు మర్నాడు ఉదయం రావణుడి భవనానికి వెళ్లి, మంత్రులు తప్ప మరెవరూ లేని సమయంలో తన అన్నతో, “సీత వచ్చినది మొదలు అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి లంకలోని ప్రతి పురుషుడికి, స్త్రీ కి కూడా తెలుసును. మంత్రులు మాత్రం నీతో ఈ సంగతి చెప్పరు. అన్ని విషయాలూ చక్కగా ఆలో చించి న్యాయప్రకారం చెయ్యి,” అన్నాడు.
రావణు డి మాట విని కోపంచెంది, “నా కెవరి భయమూ లేదు. రాముడు సీతను పొందలేడు, దేవేంద్రుడు సహాయం వచ్చినా యుద్ధంలో నా ఎదట నిలవలేడు,” అని చెప్పి విభీషణుణ్ణి పంపేశాడు.
తరువాత రావణుడు యుద్ధం గురించి తన మంత్రులతో ఆలోచించగోరి, తన రథాన్నెక్కి, సపరివారంగా సభా భవనానికి వెళ్ళి, రాక్షసుల నందరినీ పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. దూతలు రాక్షసు అందరి ఇళ్ళకు వెళ్ళి వేరువేరు పనులలో నిమగ్నులై ఉన్న రాక్షసులను పిలిచారు. వారందరూ వచ్చిన మీదట, రావణుడు విభీషణుణ్ణి, శుకుణ్ణి, ప్రహస్తుణ్ణి ప్రత్యేక స్థానాలలో కూర్చోమని చెప్పి, ప్రహస్తుడితో, “మన రాక్షస సైనికులు లంకానగరాన్ని ఎప్పటి కన్న జాగ్రత్తగా రక్షించాలని చెప్పు,” అన్నాడు.
ప్రహస్తుడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి, “సమస్త సైన్యమూ సంసిద్ధంగా ఉన్నది,” అని చెప్పాడు.
“మీ సలహాతో ప్రారంభించిన ప్రతి పని సఫలమయింది. ఇప్పుడు కూడా మీ సహాయంతో నాకు జయంలభించి తీరుతుంది. ఇప్పుడున్న సమస్య ఏమిటో మీకు ముందే చెప్పాను. ఆరు మాసాలుగా నిద్రపోతూ ఉండటం చేత ఒక్క కుంభకర్ణుడికే చెప్పలేదు. అత నిప్పుడిక్కడ ఉన్నాడు. జనకుడి కుమార్తే, రాముడి భార్యా అయిన సీతను రాక్షసులుండే దండకారణ్యం నుంచి తెచ్చాను. ఎంత ప్రార్థించినా ఆమె నన్ను ప్రేమించటం లేదు. అలాటి సుందరి మూడు లోకాలలోనూ లేదు. ఆమె మూలాన నేను మోహావేశంతో దహించుకు పోతున్నాను. రాముడు వచ్చి తనను రక్షిస్తాడేమో. నన్న నమ్మకంతో సీత నన్ను ఒక సంవత్సరం గడువడిగింది. నేను సరే నన్నాను. రాముడు వానర సేనతో సముద్రం దాటి రావటం అసాధ్యం. కాని దాటి రాగలిగితే మన మేం చెయ్యాలి? ఎందుకంటే ఒక్క వానరుడు సముద్రం దాటి వచ్చి పెద్ద యుద్ధం చేసి పోయాడు. అందుచేత బాగా ఆలోచించండి. రాముడు వానర సేనతో సముద్రం అవతలి ఒడ్డున చేరి ఉన్నాడు. సీతను ఇచ్చేమాట అబద్ధం. రామలక్ష్మణులను చంపే ఉపాయం చూడండి,” అని రావణు డన్నాడు.
రావణుడన్న మాటలు విని కుంభ కర్ణుడు మండిపడుతూ, “మాతో ఈ అలోచన సీతను తీసుకు రాకపూర్వం చేసి ఉండ వలిసింది. ఏ పని చేసేటప్పుడైనా ముందు గానే చక్కగా ఆలోచిస్తే తరువాత పశ్చాత్తాపపడ నవసరముండదు. కొంచెంకూడా ఆలో చించకుండా సీతను అపహరించి తెచ్చావు.. రాముడు నిన్నిదివరకే చంపక పోవటం అదృష్టం. ఈ స్థితిలో నీ శత్రువులు నందరినీ చంపి నీ కార్యం నెరవేర్చే శక్తి గల వాణ్ణి నేనొక్కణ్ణి ఉన్నాను. నేనా పని చేస్తాను. అందుచేత నీవు నిశ్చింతగా ఉండు,” అన్నాడు.
కుంభకర్ణుడి మాటలు రావణుడికి కోపం. కలిగించాయి. ఆ సంగతి గ్రహించి మహా పార్శ్వుడనే రాక్షసుడు, “తేనె కోసం భయంకర మృగాలున్న వనంలో ప్రవేశించి తేనె సంపాదించుకున్న వాడు దాన్ని తాగకపోతే వాడు వట్టి మూఢుడు. రావణా, అందరికీ నీవే ఈశ్వరుడవు, నిన్నడగల వారెవరు? సీతను యధేచ్ఛగా అనుభవించు, ఆమె ఒప్పకపోతే బలాత్కారంగానైనా అను భవించు. నీ కోరిక తీరినాక ఏం వచ్చినా రానీ, నీవు అన్నిటినీ ఎదుర్కో గలవు. దేవేంద్రుణ్ణి సయితం జయించగల వారు కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ ఉండనే ఉన్నారు. సామదాన భేదాలన్నవి చేతగాని వారికి. నీవు దండోపాయంతోనే కార్యసిద్ధి పొందు,” అన్నాడు.
ఈ మాట రావణుడికి నచ్చింది. అతను మహాపార్శ్వుడితో, “నన్ను గురించి ఒక రహస్యమున్నది. ఒకప్పుడు పుంజికస్థల అనేది బ్రహ్మదేవుడి ఇంటికి పోతూ ఉంటే చూసి దానిని బలాత్కారంగా చెరిచాను. ఆ సంగతి బ్రహ్మకు తెలిసిందట. ఆయన, అది మొదలు నేను ఏ పర స్త్రీని గాని బలా త్కారంగా అనుభవిస్తే నా తల నూరు ముక్కలవుతుందని శపించాడు. ఆ శాపానికి భయపడే నేను సీతను బలాత్కారంగా అనుభవించ లేదు. నాకు గల వేగమూ, గమనశక్తి తెలియక రాముడు వస్తున్నాడు. గుహలో నిద్రపోయే సింహాన్ని లేపినట్టుగా మృత్యువులాటి నన్ను కవ్విస్తున్నాడు. నా బాణాల దెబ్బ ఎరగడు. ఇక తెలియజేస్తాను,” అన్నాడు.
ఈ ధోరణిని విభీషణుడు సహించలేక తనకు తోచిన మాటలు నాలుగూ దులిపేశాడు. సీతను తీసుకురావటం అయిదు తలల విష సర్పాన్ని తెచ్చుకోవటమే నన్నాడు, రాముణ్ణి ఇంద్రజిత్తయేది, రావణుడయేది, ఎవరయేది జయించటం కల్ల అన్నాడు, రావణుడు తప్పు తోవను పోతుంటే మిగిలినవారు అతన్ని సరి అయిన మార్గానికి తిప్పటానికి బదులు ఇచ్చకాలాడు తున్నారన్నాడు. సీతను రాముడి వద్దకు పంపెయ్యటం అందరికీ క్షేమమని తేల్చాడు.
విభీషణుడు చెప్పిన ఈ మాటలకు ఇంద్రజిత్తు. ” బాబాయీ, పులస్త్య వంశంలో పుట్టినవాడు అనరాని మాట అన్నావు. బల శౌర్య పరాక్రమాలు లేని పిరికి పండవు! ఎందుకు అందరినీ భయ పెట్టుతున్నావు? రామ లక్ష్మణులను చంప టానికి ఒక్క రాక్షసుడు చాలు. నేను ఇంద్రుణ్ణి ఓడించాను. నన్ను చూసి దేవ తలు గొర్రెల మందలాగా పారిపోయారు. ఐరావతాన్ని కూల్చి, దాని దంతాలు పెరికాను. అల్పులైన ఈ రాజకుమారులను జయించలేనా?” అన్నాడు.
“నాయనా, కుర్రవాడివి. నీ బుద్ధి పరి పక్వం కాలేదు. నీ తండ్రి పక్షంగా మాట్లా డుతూ అతనికే శత్రువవుతున్నావు. ఈ సభలో నిన్ను మాట్లాడనివ్వటమే తప్పు. సీతను కానుకలతో సహా రాముడికి అర్పించి నట్టయితే మనమంతా సుఖంగా ఉండ “వచ్చు.” అని విభీషణు డన్నాడు.
ఈ మాట అన్నందుకు రావణుడు విభీషణుడి పై విరుచుకుపడ్డాడు. “జ్ఞాతివి, శత్రు పక్షపాతివి. జ్ఞాతి కన్న పగవాడు లేడు. తమ్ముడి పని క్షమించాను. మరొక డైతే చీల్చేసి ఉందును. ఛీ, వంశం చెడబుట్టిన వాడా !” అన్నాడు.
రావణు డిలా చీదరించుకోగానే విభీష ణుడు మరి నలుగురు రాక్షస అనుచరులతో సహా ఆకాశంలోకి లేచి, “అన్న వని నీ మేలు కోరి చెప్పాను. నా మీద లేని తప్పు మోపి, నిందించావు. అది సహించరానిది. ఇష్టమైన మాటలు చెప్పేవారు కొల్లలు, కటువుగా ఉన్నప్పటికీ మేలు చేసే మాటలు చెప్పే వారు దొరకరు. నీవు రాముడి చేతిలో చావగా చూడలేను. నీ మంచి కోరి చెప్పిన మాటలను క్షమించు. నీవూ, లంకా, ఈ రాక్షసులూ క్షేమంగా ఉండేటట్టు చూచుకో. నేను పోతున్నాను. నీవు సుఖంగా ఉండు,” అని చెప్పి, అక్కడి నుంచి బయలుదేరి రామ లక్ష్మణులూ, వానరసేనా వున్న చోటికి క్షణంలో చేరుకున్నాడు.
ఆయుధాలు ధరించి ఆకాశమార్గాన అతి వేగంగా వస్తున్న విభీషణుణ్ణి, అతని వెంట ఉన్న నలుగురు రాక్షసులనూ వానరులంతా చూశారు. సుగ్రీవుడు. ఆ రాక్షసులను చూసి, క్షణం ఆలోచించి, హనుమంతుడు మొద లైన వారితో, ” ఈ రాక్షసులు తప్పకుండా మనని చంపటానికే యిటు వస్తున్నారు,చూడండి !” అన్నాడు.
వెంటనే వానర ప్రముఖులు చెట్లనూ, శిలలనూ తీసుకుని, “ఈ దుర్మార్గులను చావగొట్టి కింద పడేస్తాం. వీళ్ళెంత?” అన్నారు. ఈ లోపల విభీషణుడు తన అనుచరులతో సహా సముద్రపు ఉత్తర తీరాన్ని చేరి, ఆకాశంలోనే నిలబడి, సుగ్రీవుణ్ణి, వానరులనూ చూసి ఇలా అన్నాడు.
“దుర్మార్గుడైన రాక్షస రాజు రావణుడనే వాడికి నేను తమ్ముణ్ణి. నన్ను విభీషణు ఉంటారు. అతను జటాయువును చంపి, దుఃఖితురాలూ, వివశురాలూ అయి ఉన్న సీతను జనస్థానం నుంచి ఎత్తుకు వచ్చి రాక్షస స్త్రీల రక్షణలో ఉంచాడు. సీతను రాముడికి తిరిగి ఇచ్చివెయ్యమని నయాన ఎన్నోసార్లు చెప్పాను. కాలం మూడిన రావణుడికి నా మాట రుచించింది కాదు. అందు చేత అతను నన్ను భృత్యుడిలాగా చూసి పరుష వాక్యాలన్నాడు. నేను భార్యా పుత్రు లను సైతం విడిచిపెట్టి రాముడి శరణు వచ్చాను. నేనిలా వచ్చానని రాముడికి వెంటనే నివేదించండి.”
ఈ మాటలు వింటూనే సుగ్రీవుడు లక్ష్మణుడి వెంట రాముడున్న చోటికి వెళ్ళి, “రావణుడి తమ్ముడు విభీషణుడట, నలుగురు రాక్షసులను వెంట బెట్టుకుని నిన్ను శరణు వేడ వచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాక్షసులను నమ్మరాదు; వారు కామరూపులు, శూరులు, అదృశ్యంగా ఉండగలవారు, మాయావులు. ఇతను రావణుడి వేగులవాడుగా వచ్చి, మన విశ్వాసం సంపాదించి, మన మధ్య భేదాలు కలిగించవచ్చు; సందేహం లేదు. లేదా ఎప్పుడో ఒకప్పుడు ఇతనే మన మీద దెబ్బ తీయవచ్చు. మన శత్రువుకు తమ్ముడైన ఇతని నెలా నమ్మటం? రావణుడే అతన్ని పంపి ఉండవచ్చు. ఇతన్నీ, ఇతని అనుచరులనూ వెంటనే చంపటం మంచిది,” అని హెచ్చరించాడు.
రాముడు సుగ్రీవుడి సలహా విన్నమీదట హనుమంతుడు మొదలైన వానరప్రముఖులు కేసి చూసి, “సుగ్రీవుడు ఆలోచించి చెప్పిన మాట విన్నారుగదా. అలాగే మీరందరూ కూడా మీకు మీకు తోచిన సలహాలివ్వవచ్చు,” అన్నాడు.
విభీషణుడు ఎలాటి వాడయినదీ స్పష్టంగా తేల్చుకున్న మీదట అతనిని నమ్మటమో, మానటమో తేల్చుకుందామని అంగదు ఉన్నాడు. అతన్ని పరీక్షించటానికి సూక్ష్మ బుద్ధి గల చారుణ్ణి పంపుదామని శరభు ఉన్నాడు. విభీషణుడు ఇక్కడికి రావటమే అనుమానాస్పదంగా ఉన్నదని జాంబవంతు ఉన్నాడు.
హనుమంతుడు అందరి సలహాలనూ కొట్టి పారేశాడు. “విభీషణుడి మంచి చెడ్డలు విచారించటం ఎలా? సమీపంలో ఉన్న వాడి వద్దకు చారుణ్ణి ఎలా పంపటం? విభీషణుడు ఈ సమయంలో ఇక్కడికి రావటానికి తగిన కారణం ఉన్నది. రావణుడు దుర్మార్గుడని అతనికి తెలుసును. అలాగే రాముడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేసిన సంగతికూడా అతనికి తెలుసును. అతను రాజ్యం కోరి బుద్ధి పూర్వకంగానే తన అన్నను వదిలి యిక్కడికి వచ్చాడు. ఇలా నాకు తోస్తున్నది. తరువాత నీ యిష్టం,” అన్నాడు హనుమంతుడు రాముడితో.
విభీషణుడు రాజ్యకాంక్షతో వచ్చాడని హనుమంతుడన్న మీదట రాముడు తన అభిప్రాయాన్ని కూడా బయటపెట్టుతూ, “ఈ విభీషణు డెంత దుర్మార్గుడు కానీయండి శరణని వచ్చిన తరువాత నేను అతన్ని విడవలేను. అది సజ్జనుల పద్ధతి కాదు,” అన్నాడు.
దానికి సుగ్రీవుడు ఒప్పుకోక, “ఇతను మంచి వాడే అయితే మాత్రం ఇతని వల్ల మనకేమిటి లాభం? అతన్ని మన మేంత మాత్రమూ చేర నివ్వగూడదు. అన్నను వదిలి వచ్చిన కృతఘ్నుడు మనను నమ్ముకుని ఉంటాడని ఏమిటి ?” అన్నాడు.
“రాజులలో ఒక ధర్మం ఉన్నది. జ్ఞాతులు కూడా ఇరుగుపొరుగు రాజుల వంటి వారే కష్టకాలంలో దెబ్బ తీస్తారు. అందుచేత యోగ్యులైన రాజులు కూడా బలవంతులైన జ్ఞాతులను నమ్మరు. ఇతన్ని రావణుడు నమ్మలేక పోయాడు. అందుచేత విభీషణుడు మన వద్దకు వచ్చాడు. మనం రాక్షసులం కాము, మనకు రాక్షస రాజ్యం పైన కాంక్ష లేదు. అందుచేత మన ద్వారా ఇతను రాజ్యం పొందగోరు తున్నాడు. అతను మనని విడవడు,” అన్నాడు రాముడు.
అయినా సుగ్రీవుడు తన మనసు మార్చుకోలేక, ” రావణుడే ఇతన్ని ఇక్క డికి రహస్యంగా పంపాడు, సందేహం లేదు. నిన్నో, సన్నో, లక్ష్మణుణ్ణి కడతేర్చటానికే అతను వచ్చాడు. అందరమూ కూడా చావవచ్చు. రావణుడి తమ్ముళ్లు ఎలా నమ్మటం ?” అన్నాడు.
“సుగ్రీవుడా, అతను దుర్మార్గుడైతే మాత్రం నన్నేం చేయగలడు. ఇతను మారు వేషంలో వచ్చిన రావణుడే అయినా శరణన్న తరవాత విడిచి పుచ్చను. శరణార్థిని రక్షించటానికి ప్రాణాలైనా ఇవ్వాలి. అందు చేత నీవు వెంటనే అతన్ని తీసుకు రా!” అని రాముడు సుగ్రీవుడితో అన్నాడు.
ఈ మాటలతో సుగ్రీవుడి మనసు మారింది. అతను వెళ్ళి విభీషణుణ్ణి రాముడి వద్దకు తీసుకు వచ్చాడు. విభీషణుడు తన నలుగురు అనుచరులతో బాటు రాముడి కాళ్ళపై పడి, “నేను రావణుడి తమ్ముణ్ణి. అతని వల్ల అవమానం పొంది నిన్ను శరణు జొచ్చాను. నా స్నేహితులనూ, నా సర్వస్వాన్నీ లంకలో వదలి యిక్కడికి వచ్చాను. ఇక నా జీవితమూ, నా సౌఖ్యము, నా రాజ్యమూ నీ చేతిలో ఉన్నాయి,” అన్నాడు.
రాముడు విభీషణుణ్ణి ఆశ్వాసించి, ” రాక్షసుల బలాబలాలను యథార్థంగా వివరించి చెప్పు,” అన్నాడు. దానికి విభీషణు డిలా చెప్పాడు.