హనుమంతుడు లంకా దహనం చేయుట

అక్షకుమారుణ్ణి హనుమంతుడు చంపాడని వినగానే రావణుడికి ఎంతో దుఃఖం కలి గింది. అతను దాన్ని అణచుకుని క్రోధా వేగంతో ఇంద్రజిత్తును చూసి, “నాయనా, ఇంద్రుణ్ణి జయించిన వీరాగ్రేసరుడివి, బ్రహ్మ నుంచి దివ్యాస్త్రాలు పొందినవాడివి. ఈ కోతి కింకరుల నందరినీ చంపాడు, జంబుమాలినీ, మంత్రి కొడుకులనూ, అయిదుగురు సేనాపతులనూ, నీ తమ్ము డైన అక్షకుమారుణ్ణి చంపాడు. వాడి బలం ఎలాటిదో సరిగా గ్రహించి వాడితో యుద్ధం చెయ్యి. వెళ్ళి, శత్రువును జయించి తిరిగి రా!” అన్నాడు.

ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి, ధనుర్బాణాలు తీసుకుని, రథ మెక్కి యుద్ధోత్సాహంతో హనుమంతుడి కేసి వెళ్ళాడు. హనుమంతుడతన్ని దూరాన చూస్తూనే గట్టిగా సింహనాదం చేసి, తన శరీరాన్ని పెంచాడు. తరువాత ఇద్దరూ యుద్ధానికి తలపడ్డారు. ఇంద్రజిత్తు పద కొండువేల మంది ధనుర్దారులతో ఒక్కసారిగా యుద్ధం చేయగల వాడు. కాని అతను తనపై వేసే బాణాలు తనకు తగలకుండా తప్పించుకుంటూ హనుమంతుడాకాశాన విహరించసాగాడు.

ఎంతసేపు యుద్ధం చేసినా హనుమంతుడు ఇంద్రజిత్తుకు గానీ, ఇంద్రజిత్తు హనుమంతుడికి గాని అంతు చిక్కలేదు. తన బాణాలన్నీ వృధా అయిపోవటం చూసి ఇంద్రజిత్తు, “వీణ్ణి చంపటం అసాధ్యం. ఏదోవిధంగా పట్టుకోవటం మంచిది,” అనుకుని అందుకై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దానితో హనుమంతుడు కట్టుపడి, చెయ్యి కాలూ కదలించలేని స్థితిలో ఉండి పోయాడు. అప్పుడతనికి, పూర్వం బ్రహ్మ తనకిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అతనికి ఏ అస్త్రం వల్లా ప్రమాదం లేకుండా బ్రహ్మ వరమిచ్చాడు. బ్రహ్మాస్త్రం చేత కట్టుపడినప్పటికీ, తనను బ్రహ్మా, దేవేంద్రుడూ, వాయుదేవుడు కాపాడుతూనే ఉంటారని హనుమంతుడనుకున్నాడు. అతనికి రావణుడితో సంభాషించాలని కూడా కోరిక కలిగింది.

కదలకుండా పడి ఉన్న హనుమంతుణ్ణి రాక్షసులు సమీపించి, తాళ్ళతో అతన్ని బంధించారు. వారు హనుమంతుణ్ణి తాళ్ళతో కట్టగానే బ్రహ్మాస్త్ర బంధం దానంతట అదే విడిపోయింది. ఈ సంగతి తెలిసిన ఇంద్ర జిత్తు చాలా భయపడ్డాడు; ఎందుకంటే హనుమంతుడీ తాళ్ళను సులువుగా తెంచుగలడు, బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వాడి పైన మరో అస్త్రమూ పారదు. కనుక హనుమంతుడిప్పుడు తలుచుకుంటే లంకకు ఎంత చేటైనా చేయగలడు.

అయితే ఈ సంగతి హనుమంతుడికి తెలియలేదు. తాను తాళ్ళతో కట్టుపడగానే బ్రహ్మాస్త్రబంధం తొలగిందని కూడా అతనికి తెలియదు. ఈ లోపల రాక్షసులు హను మంతుణ్ణి కసిగా ఈడ్చుతూ, కర్రలతోనూ పిడికిళ్ళతోనూ కొట్టుతూ, రావణుడుండే చోటికి లాక్కుపోయారు. ఇంద్రజిత్తు సభలోని రావణుడికి హనుమంతుణ్ణి చూపి, ” వీడే ఆ వానరుడు,” అన్నాడు.

సభలోని రాక్షసప్రముఖులు తమలో తాము, “ఎవడీ వానరుడు ? ఇక్కడి కెందుకు వచ్చాడు? ఎవరు పంపగా వచ్చాడు? ఎవరిని చూడ వచ్చాడు ?” అని ప్రశ్నించుకున్నారు. మరికొందరు రాక్షసులు, ” ఈ వానరుణ్ణి చంపి కాల్చండి, తినేద్దాం!” అన్నారు.

హనుమంతుడు ముందుకు వచ్చి, రావణుడి సింహాసనం దిగువన కూర్చుని ఉన్న వృద్ధమంత్రులను, మణులతో అలంకరించిన సభాభవనాన్నీ కలయజూశాడు. రాక్షసులు తాళ్ళు పట్టుకుని అటూ, ఇటూ గుంజుతున్న హనుమంతుణ్ణి రావణుడు చూశాడు. అతని కళ్ళు ఆగ్రహంతో చింత నిప్పుల్లాగా అయిపోయాయి. అతను తన మంత్రులను ఆజ్ఞాపిస్తూ, హనుమంతుణ్ణి చూపి, ” వీడి విషయమేమిటో అడిగి కనుక్కోండి!” అన్నాడు.

హనుమంతుడు రావణుణ్ణి, అతని మంత్రులైన దుర్ధరుణ్ణి, ప్రహస్తుణ్ణి, మహా పార్శ్వుణ్ణి, నికుంభుణ్ణు, రావణుడి అత్యంత వైభవాన్నీ, తేజస్సునూ చూసి ఆశ్చర్యం పొందాడు. ఈ రావణుణ్ణి చూసి మూడు లోకాలూ గజగజ లాడటంలో వింత ఏమీ లేదని అతనికి అనిపించింది.

ఇంతలో రావణుడి ప్రేరణతో ప్రహస్తుడు హనుమంతుడితో ఇలా అన్నాడు:

“వానరుడా, భయపడకు. నిన్నెవరు పంపారు? దిక్పాలకులా ? విష్ణువా ? ఎవరు పంపినప్పటికీ నిన్నేమీ చెయ్యము. నిజం చెప్పు, నిన్ను విడిచిపెడతాము. నీవు చూడటానికి కోతిలాగా ఉన్నావేగాని, నీ ప్రభావం చాలా హెచ్చుగా కనబడుతున్నది. అబద్ధం చెప్పావో, నీ ప్రాణాలు దక్కవు. ఒకవేళ నీ అంతట నీవే వచ్చి ఉంటే, ఎందుకు వచ్చావో చెప్పు.”

ప్రహస్తుడీ మాట అనగానే హను మంతుడు రావణుడి కేసి తిరిగి, “నన్ను పంపినది ఇంద్రుడూ, కుబేరుడూ, వరుణుడూ, యముడూ కాదు, విష్ణువు కూడా కాదు. నేను పుట్టుకతోనే వానరుణ్ణి, నాది తెచ్చిపెట్టుకున్న వానరరూపం కాదు. నిన్ను చూడటం సులభం కాదు గనక, అందుకై ఆశోకవనాన్ని నాశనం చేశాను.”

“అప్పుడు బలవంతులైన రాక్షసులు నా పైకి వచ్చారు. ఆత్మరక్షణ కోసం వారిని చంపాను. బ్రహ్మ వరం వల్ల నన్ను ఏ అస్త్రమూ ఏమీ చెయ్యలేదు. కాని నిన్ను చూడాలనే కోరికతో బ్రహ్మాస్త్రానికి కట్టుపడ్డాను. నీతో ఒక రాచకార్యం ఉండి వచ్చాను. నేను రాముడి దూతను. నీకు శుభకరమైన మాటలనే చెబుతాను, విను. ఈ మాటలను సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు”

“దశరధుడి కొడుకైన రాముడు, తన భార్య అయిన సీత తోనూ, తమ్ముడైన లక్ష్మణుడితోనూ తండ్రి ఆజ్ఞ పాలించి దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ రాముడి భార్య అయిన సీత కన పడకుండాపోయింది. రాముడు సీతను వెతుకుతూ ఋశ్యమూకానికి వచ్చి సుగ్రీవుణ్ణి చేరుకున్నాడు. తరువాత ఆయన వాలిని చంపి, సుగ్రీవుణ్ణి వానర భల్లూకాలకు రాజునుగా చేశాడు. అందుకు ప్రత్యుపకారంగా సుగ్రీవుడు సీతను వెతికిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆయన అన్ని దిక్కులకూ వానరులను పంపాడు. వారిలో ఒకడనైన నేను వాయుపుత్రుణ్ణి, హనుమంతుడనే వాణ్ణి. నేను నూరు యోజనాల సముద్రం దాటి సీతను చూడటానికి వచ్చాను. నీ అధీనంలో ఉన్న సీతను చూశాను.”

“ఎంతో తపస్సు చేసి, ధర్మం తెలిసిన నీ వంటివాడు పరస్త్రీని చెరపట్టటం కూడని పని. రాముడికి అపచారం చేసి ఫలమనుభవించకపోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఇక ముందు రాముడేం చేస్తాడో నాకు తెలియదు. సీతను రాముడి కిచ్చి వేయటం నీకు శ్రేయస్కరం. అనేక జాతుల వల్ల నీకు మరణం రాకుండా వరం పొంది ఉన్నావు నిజమే, కాని సుగ్రీవుడు ఆ జాతులలో దేనికి చెందని వానరుడు. నరుడైన రాముడి చేతిలోనో, వానరుడైన సుగ్రీవుడి చేతిలోనో నీకు చావు తప్పదు.”

“రాముడు ఒప్పడు గాని, నేనొక్కణ్ణి నీ లంకను నిర్మూలించ గలను. అసలు సీతను అపహరించి తెచ్చినప్పుడే మృత్యు దేవతను మెడకు చుట్టుకున్నావు. నేను రాయబారిని, అటు మానవుణ్ణి కాను, ఇటు రాక్షసుణ్ణి కాను. అందుచేత నీ మంచి కోరి చెబుతున్నాను. రాముడితో వైరం పెట్టుకుని నీవు జీవించలేవు,” అన్నాడు.

ఈ మాటలు విని రావణుడు కోపోద్రేకంతో హనుమంతుణ్ణి చంపవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు విభీషణుడు తన అన్నకు అడ్డు తగిలి ఇలా అన్నాడు ” ఈ దూతను చంపటం రాజ ధర్మం కాదు.

“ఆగ్రహావేశంలో ధర్మహాని చెయ్యటం తగదు. ఇతను కేవలము దూత మాత్రమే కాదు, అక్షుడు మొదలైన వారిని చంపాడు కనుక శత్రువే. అయినను దూతగా వచ్చిన వాడికి విధించే శిక్షలున్నాయి. ఇతనికి అంగ వైకల్యం కలిగించవచ్చు, కొరడాతో కొట్టవచ్చు. శిరస్సు ముండనం చేయవచ్చు. కాల్చి ముద్ర వేయవచ్చు. కాని చంపరాదు. శాస్త్రం మాట అటుంచి, ఇతన్ని చంపటం చేత మనకేమీ లాభం లేదు. ఇతన్ని ఎవరు పంపారో వారిని చంపు.”

ఈ మాట రావణుడికి నచ్చింది. “నిజమే, దూత అయిన వీణ్ణి చంపవద్దు, మరేదైనా శిక్ష విధింతాము. కోతులకు ఇష్ట మైనది తోక. ఇతడి తోకను కాల్చి పంపెయ్యండి. తోక అంటించి వీణ్ణి విధులన్నీ తిప్పండి,” అన్నాడు.

రాక్షసులు హనుమంతుడి తోకకు గుడ్డ పీలికలు చుట్టి, చమురుపోసి అంటించి, నాలుగు వీధులూ తిప్పుతూ, “వేగులవాణ్ణి చూడండి,” అని కేకలు పెట్టారు. హనుమంతుడిది లక్ష్యపెట్టక, పట్టపగలు నగర రక్షణ సాధనలు ఎట్లాఉన్నదీ చూడవచ్చునని ఆశపడ్డాడు. అతన్ని చూడటానికి రాక్షస స్త్రీలూ, పిల్లలూ ఎగబడ్డారు.

కొందరు రాక్షసస్త్రీలు సీత వద్దకు వెళ్ళి, “నీతో మాట్లాడి వెళ్ళాడే, ఆ వానరుడి తోకకు నిప్పు అంటించి, నగరమంతా తిప్పు తున్నారు,” అని చెప్పారు.

సీత ఆ మాటలు విని చాలా బాధపడి, “నేనే పతివ్రతనైతే హనుమంతుడికి చల్లగా ఉండు,” అని అగ్ని హోత్రుణ్ణి ప్రార్దించింది.

సీత ఈ మాట అనగానే హనుమంతుడి తోకలోని జ్వాలలు మరింత పెద్దవయాయి. కాని హనుమంతుడికి మంట తోచలేదు. అది చూసి హనుమంతుడికి ఆశ్చర్యమయింది. అతను చేయవలసిన దాన్ని గురించి ఆలోచించాడు. మొట్టమొదటగా మిక్కిలి చిన్నవాడై కట్ల నుంచి విడిపించు కున్నాడు. మరుక్షణమే తన దేహాన్ని పెంచి, నగరద్వారం వద్ద ఉన్న పరిఘను తీసుకుని, తన వెంట ఉన్న రాక్షసుల నందరినీ చావమోదాడు. అతను లంకా నగరం కేసి చూస్తూ, ” ఇప్పుడేం చేస్తే బాగుంటుంది?” అనుకున్నాడు.

అప్పటికే రాక్షసులకు చేయవలసిన నష్టం చాలా చేశాడు, లంకా దుర్గాన్ని నాశనం చెయ్యటమే మిగిలి ఉన్నది. లంక లోని మహాభవనాలను అగ్నిహోత్రుడికి ఆహుతి ఇవ్వటమే కర్తవ్యం.ఈ మాట అనుకుని హనుమంతుడు మండుతున్న తోకతో లంకలోని భవనాల మీదుగా సంచరించ నారంభించాడు. నిర్భయంగా రాక్షసులు యిళ్ళన్నీ తిరిగాడు. ప్రహస్తుడి భవనానికి నిప్పు అంటించి, మహా పార్శ్వుడి ఇంటి పైకి దూకాడు. ఆ ఇంటిని దేదీప్యమానంగా అంటించి, తరువాత వరుసగా వజ్రదంష్ట్ర, శుక, సారణుల గృహాలకు నిప్పు పెట్టేశాడు. తరువాత ఇంద్రజిత్తూ, జంబుమాలి, సుమాలిల ఇళ్ళన్ని అంటించాడు. అతను ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప మిగిలిన రాక్షసోత్తముల ఇళ్ళను, మణులతో సహా తగలబెట్టేశాడు.

లంక కంతా చిచ్చుపెట్టే హనుమంతుడికి సహాయంగా వాయుదేవుడు వీచాడు. వాయువు సహాయంతో లంక అంతా వేగంగా అంటుకున్నది. ఒక్కొక్క మేడే కూలి పడసాగింది.

మండిపోతున్న తమ ఇళ్ళను రక్షించు కోవటం రాక్షసులకు సాధ్యంకాలేదు. మగవాళ్ళూ, పిల్లలూ, స్త్రీలూ భీభత్సంలో ముణిగిపోయారు. ఎంతోమంది మంటలలో నశించారు. తగలబడిపోతున్న లంక భయంకరంగా కనబడింది. రాక్షసుల ఆర్తనాదాలు ఈ దృశ్యాన్ని మరింత భయానకం చేశాయి.

హనుమంతుడు ఒక్కసారి లంక అంతా కలయజూచి, ఆ నగరంలోని అన్ని ప్రాంతాలూ తగలబడిపోతూ ఉండటం గమనించి, తన తోకలోని మంటలను సముద్రంలో ముంచి ఆర్పేశాడు.ఆ సమయంలో అతనికి పెద్ద భయం పట్టుకున్నది. లంకతో బాటు సీత కూడా తగలబడిపోయి ఉంటుంది! ఈ ఆలోచన రాగానే హనుమంతుడు తనను తాను తిట్టుకున్నాడు; ఆగ్రహం చెందిన వాడికి కార్యా కార్య విచక్షణ లేకుండా పోతుందను కున్నాడు; తాను వచ్చిన పని అంతా మంట కలిసి పోయిందనుకున్నాడు.

కాని అంతలోనే అతనికి మళ్ళీ ధైర్యం వచ్చింది. తాను వచ్చిన పని ఇన్ని విధాలు సఫలమైన తరువాత సీత చావటం జరగదు. తన తోకనే కాల్చని అగ్నిహోత్రుడు. సీతను దహిస్తాడా? అలా ఎన్నటికీ జరగదు. సీతే అగ్నిలాటిది! ఆమెను అగ్ని ఏం చెయ్యగలడు? అతనలా అనుకుంటూండ గానే ఆకాశాన చారణులు అనుకునే మాటలు వినిపించాయి. లంక అంత ధగ్ధమైనా సీతకు ఏ అపాయమూ కలగక పోవడం గురించి వారు ఆశ్చర్యంగా చెప్పుకునే మాటలు విని హనుమంతుడు పరమానందం చెందాడు.

Leave a Reply